పొగ భార(త)౦ ‘జూద రాజధాని’ ఇప్పుడు ‘ధూమ రాజధాని’ అయింది.

పొగ భార(త)౦

రచన : పునీత్ ప్రశాంత్ కూరపాటి. . .

వెధవ బ్యాచిలరు బతుకు. రూములో రూపాయి ఉండి చావదు. పొద్దున్నే లేచి కడుపునిండా పొగ నింపుకోడానికి గూళ్ళన్నీ వెతికినా చిల్లర పైసలు రాలవు. మా తాత ఇచ్చిన డెబ్భైల నాటి వింటేజీ వాచీ మాత్రం చింతపండేసి తోమిన వెండి కంచంలా మెరుస్తూ కన్పిస్తుంది. దాన్ని ఎప్పుడెప్పుడు తాకట్టు పెడదామా అనిపిస్తుంది. కానీ ఇంటికి వెళ్ళినప్పుడల్లా నా గురించి వదిలేసి వాచీ గురించి అడుగుతుంటాడు మా తాత ముసలోడు. దాన్ని తాకట్టు పెట్టాననో , అమ్మేసాననో తెలిస్తే ఎక్కడ “హరీ” అంటాడో అని నా గుబులు. ఆ గుబులు , దిగులు అచంచల వాత్సల్యాభిమానాల వల్ల అనుకొని పాత సినీమాల్లో ఒక్క సీన్ క్యారెక్టర్ లాగా ఓవర్ గా ఆలోచించి ఓవరాక్షన్ చేయకు. అసలు సంగతి ఏంటంటే మా పిసినిగొట్టు బాబు “పైసల్లేవ్ గీసల్లేవ్” అని కసిరినప్పుడల్లా ముసలోడే నాకు దిక్కు దివానం. అందుకే నేనే ఏదోలా ఇక్కట్లు పడదామని గది దాటాను.

          అలా గది దాటానో లేదో కనపడింది లుంగీకి పడిన చిల్లు. ఎక్కువ ఉతకటం వల్ల కాదు, ఎక్కువ వాడటం వల్ల పడిన చిల్లు అది. జేబుకి ఎప్పుడో పడింది. అది మెల్లగా కిందకు జారి లుంగీకి కూడా అంటింది. ‘చిల్లు అంటడం ఏమిటో’ అని బుర్ర గోక్కుని యక్ష ప్రశ్నలు వేయకు. చెప్పేది విను. లేకపోతే అవతలికి పో. అసలు లుంగీ అంటేనే అద్దానికి పెద్దన్న లాంటిది. సగం ప్రపంచానికి సంగతులన్నీ జల్లెడ పట్టకుండా చూపించేస్తుంది. ఇంక దానికి చిల్లు పడటం అంటే ఒళ్ళంతా తీస్కెళ్ళి సుల్తాన్ బజార్ సంతలో ఫ్రీగా పెట్టడమే.  ఆ లుంగీని గడపలోనే అటూ ఇటూ సర్ది , ఏదోలా ప్రపంచాన్ని ఏమార్చి ,అనంత విశ్వానికి నా శీలం తాలూకు ఛాయలు ఇసుమంతైనా కనపడకుండా జాగ్రత్త పడి బయటికి రాగానే మొదలైంది. వర్షం కాదు……ఒకలాంటి నీరసం. నోరు పీకేస్తోంది. మనసు లాగేస్తుంది.పొగ కోసం. గుండె నిండా , ఊపిరితిత్తుల నిండా , కడుపు నిండా ఇంకా ఒంట్లో ఎక్కడైనా నింపుకునే ఖాళీలుంటే వాటినిండా నింపుకోవాలని ఆరాటం.
‘ఏం చేయాలా’ అని ఆలోచిస్తుంటే గుర్తొచ్చాడు పాన్ కొట్టు పులకేశి. వాడి అసలు పేరు పుల్లారావో , కేశవ రావో ఉంది. నాకది సరిగా గుర్తులేక “పులకేశీ” అని చరిత్ర చిత్తు పేజీల్లో ఉన్న చెత్త నామధేయంతో పిలుస్తుంటా. అదేదో ‘అజ్ఞాతవాసం’ నాటకంలో ఉత్తమపాత్ర పోషించిన భీముడి పాత్రధారికి ఇచ్చిన బిరుదులాగా సంబరపడతాడు మా పులకేశి. ఆ అభిమానంతోనే ఒకటీ అరా సత్తు సిగరెట్లు దానమిస్తాడు‌‍‌. లేకపోతే పదో పరకో అప్పిస్తాడు. అది వాడి మూడు. కానీ వాడి దగ్గరకు వెళ్ళాలంటే మూడు కిలోమీటర్లు కాళ్ళీడ్చాలి.
ఇది నా గోడు.

‘పొద్దు పొద్దున్నే ఆ మాత్రం నడవటం పెద్ద లెఖ్ఖా. నడుములు పడిపోయిన ముసలమ్మ కూడా ‘టింగురంగా’ అని తిరిగొస్తుంది’ అని సొల్లు మాటలు చెప్పొద్దు. ముందే చెప్పా కదా నాదసలే
దిక్కుమాలిన దిక్కుతోచని దరిద్రపుగొట్టు బ్యాచిలర్ బతుకు. ఇక్కడ ఆరుకి లేచి పదికి పడుకోటం అనేది సాధ్యమే అని ఎవడైనా నీతో చెప్తే ముందూ వెనకా ఆలోచించకుండా నాలుగు పీకు.
ఇప్పుడు టైం పదకొండు. సూరిగాడు అప్పుడే నడినెత్తి మీదెక్కాడు. నా బతుకేమో పొగబండికంటే హీనం. ఇడ్లీలూ , టీనీళ్ళూ లేకపోయినా పర్లేదు కానీ ఓ గోల్డు ఫ్లేకో , దాంట్లో అరముక్కో దొరక్కపోతే అగమ్యగోచరం రోజంతా. ఇక చేసేదేమీ లేక అరిగిపోయిన చెప్పుల్తో రోడ్లు ఊడవటం మొదలుపెట్టా. తీరా అంతదూరం ఎండలో పడి పాన్ కొట్టు దాకా పోతే ‘పులకేశి’ లేడు. వాడి కొడుకు ‘నరికేశి’ ఉన్నాడు. వాడి పేరు నరసింహమో కేశతైలమో కాదు. నాలాగా ఉత్తి పుణ్యానికి కొట్టు మీద పడే వాళ్ళని నరికేసేలా ఉంటాడు వాడు. అయినా ‘ఉత్తి పుణ్యం’ అనే కూత ఎందుకు కూస్తారో ఎదవలు. పుణ్యం ఎవడికైనా ఊరికే వస్తుందా. అలా ఊరికే వస్తే మనకసలు ఈ పురాణాలూ పుణ్యక్షేత్రాలు, లంకా దహనాలూ లెంపకాయలూ ఉంటాయా. మనం వాటిని నిద్రలో కూడా మర్చిపోకుండా అప్పజెప్పగలమా. అసలీ ‘నరికేశి’ బాపతు అరకొరగాళ్ళని వరసలో నిలబెట్టి అరమీసం గొరిగేస్తూ ఉండాలి. అప్పుడైనా బుద్ధొస్తుందా లేదా అన్నది అప్రస్తుతం.
మళ్ళీ మూడు కిలోమీటర్లు వెనక్కి నడవాలా అని ఆలోచిస్తుంటే కనపడింది అసలైన పొగ భారతం. ఎక్కడంటావా…. ఇంకెక్కడ . రోజూ సవాలక్ష జనాల దినాలను అచ్చు తప్పు పోకుండా అక్షర సాక్షిగా సంతాపం తెలిపే దినపత్రికలో. అదేంటో మనం. అదే … మనలాంటి జనం. ఇంటి పక్కనోడో , తెలిసినోడో చచ్చాక వాడి దినం కార్డు ఇంటికొస్తే లోపలికి కూడా తీసుకురాకుండా సగం చింపి అవతల విసిరి చేతులు కడుగుతాం. కానీ చావులకు తప్ప నవ్వులకు తావు లేని న్యూస్ పేపర్ తో
మాత్రం పూజ గదిలో ప్రసాదం పొట్లాలు కట్టి పదిమందికి పంచి సంబరపడతాం. ఇదీ మన జనం , వాళ్ళ ముదనష్టపు దినం. దినం అంటే మళ్ళీ ఆ దినం కాదులే. ‘డే’ అని నువ్వు స్టైలుగా మూతి తిప్పుతావు కదా .. ఆ దినం.
ఇంతకీ నేను చూసిన పొగభారతం నా సిగరెట్టు పీకదో , బీడీ ముక్కదో కాదు. దేశ రాజధానిది. హా నిజమే. నువ్వు సరిగ్గానే విన్నావు. స్వాతంత్రం నుంచి డెబ్భై ఏళ్ళుగా , అంతకు ముందు
వందల ఏళ్ళుగా దేశం మొత్తాన్ని ఏకఛత్రాధిపత్యంగా పరిపాలిస్తున్న ఢిల్లీ అని పిలవబడు హస్తినాపురముదే. ఇతిహాసాల్లోని ‘జూద రాజధాని’ ఇప్పుడు ‘ధూమ రాజధాని’ అయింది. అప్పుడు ద్రౌపదిని కాపాడటానికి కృష్ణుడొచ్చాడు. కానీ ఎన్ని చీరలు చుట్టుకున్నా వెంటాడి మరీ ఆయుఃహరణం చేసే ఈ కాలుష్య దుశ్శాసనుడి నుంచి తప్పించటానికి ఏ కలికాల కృష్ణుడు రావాలో. పాపం సుప్రీంకోర్టు. . .దీపావళి రోజు ఢిల్లీలో మతాబులు, ఔట్లు కాల్చకూడదని తీర్పు చెప్పి సంకలు గుద్దుకుంది. అలాంటి సంకలు లక్ష గుద్దుకున్నా ప్రయోజనం ఉండదని ఏ స్కూల్ పిల్లోడిని అడిగినా చెబుతాడు. అయినా ఏమిటో మన దేశం. అయితే అతివృష్టి లేకపోతే అనావృష్టి అన్నట్టుగా నాకిక్కడ మూడంగుళాల పొగ పీక దొరక్క ఏడుస్తుంటే రాజధానిలో మాత్రం టన్నుల కొద్దీ పొగ ఎక్కడ పడితే అక్కడ ఉందట. నాలాంటి పొగరాయుళ్ళు మజా చేస్తున్నారనుకుంటా ఆ సుందర మనోహర ధూమామృత వాతావరణాన్ని చూసి. నీకు మాత్రం ఏం తెలుసులే. నువ్వేమైనా చూసావా చచ్చావా.
అన్నట్టూ అడగటం మర్చిపోయా…… నీ జేబులో సిగరెట్టు ఏమైనా ఉందా. ?!?!

You may also like...

Leave a Reply

Your email address will not be published.